దివ్యాంశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
భైంసా, అక్టోబర్ 28 (E6tv న్యూస్).
దృష్టి లోపంతో బాధపడుతున్న దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవనం సాగించేందుకు మొబిలిటీ స్టిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఓంకార్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జోగ్ దండే చంద్రకాంత్ పేర్కొన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
భైంసా పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో దివ్యాంశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, తనూర్ కేంద్రంలోని ఓంకార్ హాస్పిటల్ డాక్టర్ జోగ్ దండే చంద్రకాంత్ సహకారంతో బుధవారం ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే ద్వారా గుర్తించిన నిరుపేద కుటుంబాలకు చెందిన 30 మంది దృష్టిబాధిత దివ్యాంగులకు ఉచితంగా మొబిలిటీ స్టిక్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్నవారు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు మొబిలిటీ స్టిక్స్ ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. వీటి సహాయంతో రోడ్లపై, ఇళ్లలో నడిచేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను గుర్తించి మరింత సురక్షితంగా ముందుకు సాగవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు స్వతంత్రంగా జీవించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని అన్నారు.మొబిలిటీ స్టిక్స్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమకు సహకారం అందించిన దాతలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జోగ్ దండే చంద్రకాంత్, ఎల్వీ ప్రసాద్ బాబురావు, ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతినిధి దిగంబర్, దివ్యాంశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంచగుడి మహేష్, శ్యామ్, లక్ష్మణ్, పరమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

