వినియోగదారులకు ఇబ్బందులు.. సంబంధిత శాఖలతో తనిఖీలు చేపట్టాలని సబ్ కలెక్టర్‌కు వినతి
భైంసా, అక్టోబర్ 28 (E6tv న్యూస్).
భైంసా పట్టణంలోని పలు వాణిజ్య దుకాణాల్లో వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదని, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా చైతన్య వినియోగదారుల సమితి సభ్యుడు సుంకేట మహేష్ బాబు కోరారు. ఈ మేరకు అక్టోబర్ 26న భైంసా సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
పట్టణంలోని కిరాణా, వస్త్ర, మెడికల్, జనరల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్ తదితర దుకాణాల్లో చాలా చోట్ల వినియోగదారులు అడిగినా పక్కా బిల్లులు ఇవ్వడం లేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వస్తువుల వారంటీ, రిటర్న్ వంటి సౌకర్యాలను పొందడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వానికి పన్ను ఆదాయంలో నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.మరోవైపు, కొన్ని ఆసుపత్రుల్లో బయట మందులు కొనుగోలు చేయడానికి అనుమతించకుండా, ఆసుపత్రి పరిధిలోనే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. తక్కువ ధరకు లభించే జనరిక్ మందులపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందుల కొనుగోలులో రోగులకు తగిన ఎంపిక ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్, కార్మిక శాఖ అధికారులు, జీఎస్టీ అధికారులతో సమన్వయం చేసి దుకాణాలు, మెడికల్ స్టోర్లలో తనిఖీలు నిర్వహించాలని సబ్ కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు నిబంధనల ప్రకారం బిల్లు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సుంకేట మహేష్ బాబు తన వినతిపత్రంలో పేర్కొన్నారు.

