Breaking News

పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం.

ఐదు రోజులపాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 50 ఏళ్లు పైబడిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

బ్రిడ్జ్ గ్యాప్, ఇందూర్ క్యాన్సర్, మేఘనా డెంటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌కు సమర్థవంతమైన చికిత్స సాధ్యమని పోలీస్ కమిషనర్ సూచన

ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్‌రే, ఆర్‌బీఎస్, పీఎస్‌ఏ సహా పలు ఉచిత వైద్య పరీక్షలు

నిజామాబాద్, జూలై 21: E6 tv NEWS, శివ ఠాకూర్.

పోలీస్ శాఖ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘనా డెంటల్ హాస్పిటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఐదు రోజుల వైద్య శిబిరాన్ని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని, నిరంతర విధులు, ఒత్తిడి, అసమయ భోజనం, నిద్రలేమి వంటి కారణాలతో పోలీసులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశముందని తెలిపారు. అందువల్ల ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు.

క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే విజయవంతంగా చికిత్స చేయవచ్చని పేర్కొన్న ఆయన, ముఖ్యంగా 50 సంవత్సరాలు పూర్తయిన పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత స్క్రీనింగ్ శిబిరాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ధూమపానం, పొగాకు, గుట్కా, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, తగిన విశ్రాంతి, ఒత్తిడి నియంత్రణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని అన్నారు.

శిబిరంలో ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్‌రే, ఆర్‌బీఎస్ పరీక్ష, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (PSA) పరీక్షతో పాటు పలు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్య సంస్థల యాజమాన్యాలు, వైద్య బృందాలను పోలీస్ కమిషనర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ దీపిక, డాక్టర్ పనస అరవింద్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రవీంద్రనాథ్ సారి, డాక్టర్ ఆదిత్య తేజ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ధరణి కుమార్, వెల్ఫేర్ ఆర్‌ఐ సతీష్, రూరల్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *