Breaking News

రైతు బిడ్డ ఎమ్మెల్యేకు ఎడ్లబండిపై ఘన స్వాగతం

బొంద్రేడ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. పలు హామీలు ప్రకటించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

తానూర్, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బొంద్రేడ్ గ్రామంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రైతు బిడ్డగా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేను గ్రామంలోకి ఎడ్లబండిపై తీసుకొచ్చి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మహిళా సమైక్య సంఘ భవనం నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. అలాగే రూ.21 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు బొంద్రేడ్ నుంచి బోసి వరకు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే NH-61 రహదారి నుంచి అమృ సాబ్, దర్గా గుట్ట వరకు రహదారి నిర్మాణాన్ని HAMలో మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.తానూర్ మండల రైతులకు కీలకమైన 28వ ప్యాకేజీ అంశాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 28వ ప్యాకేజీ అమలైతే మండలంలోని రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముధోల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించిన ఆయన.. ఇకపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *