“PAUSE FOR SAFETY” – ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి
నిర్మల్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).
అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం (DPO), నిర్మల్‌లో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “PAUSE FOR SAFETY – Pause. Think. Verify.” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.
ఏదైనా అనుమానాస్పద ఫోన్ కాల్, సందేశం, లింక్ లేదా ఆన్‌లైన్ ఆఫర్ వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా ఆగి.. ఆలోచించి.. ధృవీకరించిన తర్వాతే చర్య తీసుకోవాలని సూచించారు.నకిలీ రుణ యాప్‌లు, భారీ డిస్కౌంట్ ఆఫర్లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ కస్టమర్ కేర్, సోషల్ మీడియా మరియు యూపీఐ లావాదేవీల పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.
తెలియని లింకులపై క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపడం చేయవద్దని తెలిపారు. ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మే ముందు వాటి నిజానిజాలను అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSతో పాటు సైబర్ క్రైమ్ అధికారులు, WSI శ్రావణి, SI ముత్యం పాల్గొన్నారు.


