ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించాలి – బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి
బోధన్, అక్టోబర్ 24:(E6tv NEWS).
బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన బేబీ ప్రొడక్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విద్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఐసీడీఎస్ బోధన్ సీడీపీఓ నందిని, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆసియా, హెచ్ఎస్ యాదమ్మ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, పీహెచ్ఎస్ నిర్మల తదితరుల చేతుల మీదుగా ఈ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న మాట్లాడుతూ, ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడం, లింగ నిష్పత్తిని మెరుగుపరచడం, బాలికల పట్ల వివక్షను తొలగించడం ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని తెలిపారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలని, బాలికల పట్ల వివక్ష చూపకుండా సమానత్వ భావనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. బాలికల అభివృద్ధికి కుటుంబ సభ్యులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW) సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


