పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. మండల పరిధిలోని మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలు ఏకగ్రీవమైనట్లు మండల ఎన్నికల అధికారి బి. లీలా రాణి స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ స్థానాలన్నింటిలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇక మిగిలిన ఏకైక వేలూరు ఎంపీటీసీ స్థానానికి మాత్రమే పోలింగ్ జరగనుంది. ఈ స్థానంలో సీపీఐ అభ్యర్థి ఓట్ల వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మువ్వా విజయలక్ష్మి బరిలో నిలవడంతో తీవ్ర పోటీ నెలకొంది. వేలూరు నియోజకవర్గంలో ఉన్న 3,913 మంది ఓటర్ల కోసం అధికారులు ఐదు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

