Breaking News

తెలంగాణలో రేషన్ కార్డులపై బియ్యంతో పాటు నిత్యావసరాలు!

పెరుగుతున్న ధరలు మరియు కరవు భయాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యంతో పాటు కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల అవసరాలు, సరుకుల సేకరణ, బడ్జెట్ భారాన్ని అంచనా వేసిన అనంతరం, వచ్చే సంక్రాంతి నాటికి ఈ పంపిణీని ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులపై ఉన్న 3.42 కోట్ల మందికి ఇది లబ్ధి చేకూర్చనుంది. భవిష్యత్ అవసరాల కోసం 2027 సెప్టెంబర్ వరకు సరిపడేలా 14 నెలల బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారుల నివేదిక ఆధారంగా ఏయే సరుకులు ఎంత పరిమాణంలో ఇవ్వాలనే దానిపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *