Breaking News

కోటగిరి విద్యార్థులకు సరైన సమయంలో బస్సులు నడపాలి

గమ్యం యాప్‌లో బస్సుల రాకపోకల వివరాలు అప్‌డేట్ చేయాలి

కోటగిరి, అక్టోబర్ 27: (E6tv న్యూస్).

కోటగిరి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సులను సరైన సమయానికి నడపాలని, బస్సుల రాకపోకల వివరాలను గమ్యం యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఏత్తోండ రాజేందర్ కోరారు.ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పలు చర్యలు చేపడుతుండగా, బోధన్ ఆర్టీసీ డిపో పరిధిలో మాత్రం ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉండటం లేదని ఆయన పేర్కొన్నారు.

ఆర్టీసీ ప్రవేశపెట్టిన గమ్యం యాప్ ద్వారా బస్సుల రాకపోకలు, సమయపాలన వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే బోధన్ డిపో పరిధిలోని బీర్కూర్, దేగ్లూర్, ఔరాద్, పోతంగల్, లింగంపల్లి తదితర రూట్లలో నడిచే బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు యాప్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.బస్సుల వివరాలు యాప్‌లో లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, దీనివల్ల సమయం వృథా అవుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్సుల సమయపాలన ఎంతో ముఖ్యమని తెలిపారు.

బోధన్ ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి ఆయా రూట్లలో బస్సుల రాకపోకల వివరాలను గమ్యం యాప్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని, విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరైన సమయానికి బస్సులు నడపాలని ఏత్తోండ రాజేందర్ కోరారు. ఈ చర్యలతో ఆర్టీసీ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *