తెలంగాణలో అక్టోబరు నెలలో సాధారణానికి భిన్నంగా తీవ్ర ఎండలు, ఉక్కపోత వర్షపాతం లేకపోవడంతో జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.9 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యాయని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) వెల్లడించింది.
హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటాయి. బిహెచ్‌ఇఎల్ (BHEL), ఫలక్‌నుమా ప్రాంతాల్లో అత్యధికంగా 35.1 డిగ్రీలు నమోదు కాగా, కీసర, మల్కాజిగిరి, మలక్‌పేట్, మెహదీపట్నం ప్రాంతాల్లో 35 డిగ్రీలుగా నమోదైంది. రాబోయే 24 గంటల్లో (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకుంటుందని, సోమవారం నాటికి అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ (IMD-Hyderabad) అంచనా వేసింది. భాగ్యనగరంలో ఉదయం వేళ మంచు వాతావరణం, పగలు పాక్షికంగా మేఘావృతమై ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది.

