వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత 15,000 పరుగులు మైలురాయిని చేరుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తన సుదీర్ఘ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో తన 55వ సెంచరీ సాధించి భారత్‌కు విజయాన్నందించిన అనంతరం BCCI.tv తో మాట్లాడిన ఆయన… రికార్డులు లేదా గణాంకాల కోసం తాను ఎప్పుడూ ఆడలేదని, కేవలం జట్టును కష్టసమయాల నుంచి గెలిపించాలనే పట్టుదలే ఇన్ని సంవత్సరాలు ఆడేలా చేసిందని స్పష్టం చేశారు. కేవలం రికార్డుల కోసమే ఆడితే జట్టు లక్ష్యాలతో రాజీపడాల్సి వస్తుందని, అలాంటి ఆలోచన ఉన్నవారు ఎక్కువ కాలం అంతర్జాతీయ స్థాయిలో రాణించలేరని పేర్కొన్నారు.
మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తనబంధంపై మాట్లాడుతుంటే… గిల్‌కు ఆటపై స్పష్టమైన అవగాహన ఉందని, అందుకే ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారని కోహ్లీ కొనియాడారు. మైదానంలో క్లిష్ట సమయాల్లోనూ సీనియర్ ఆటగాళ్లు, నాయకులు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే అది జట్టులోని ఇతర యువ ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించి, సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డారు. గిల్ మాట్లాడుతూ… చిన్నతనం నుంచి ఆరాధించిన కోహ్లీ పక్కన నిలబడి ఆయన 15 వేల పరుగుల ఘనతను వీక్షించడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

