Breaking News

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ పేరుతో సైబర్ మోసాలు.. పన్ను చెల్లింపుదారులకు TGCSB హెచ్చరిక!

హైదరాబాద్: ఆదాయపు పన్ను (Income Tax) దాఖలు చేసే సీజన్ నడుస్తున్న వేళ పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను అప్రమత్తం చేసింది. ఐటీ శాఖ అధికారుల పేరుతో నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లు మరియు లింక్‌లు పంపుతూ సైబర్ నేరగాళ్లు బ్యాంకింగ్ వివరాలు, సొమ్మును కాజేస్తున్నారని హెచ్చరించింది.

బాధితులకు “మీ ఐటీ రిఫండ్ అప్రూవ్ అయింది” అని మెసేజ్‌లు పంపి, దాని కింద ఉండే “Claim Now” బటన్ లేదా లింక్‌లను క్లిక్ చేయమని నమ్మిస్తారు. ఆ లింక్‌లు క్లిక్ చేయగానే నకిలీ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అయి బ్యాంక్ ఖాతా వివరాలు, పాన్, ఆధార్ సమాచారం, పాస్‌వర్డ్‌లు మరియు ఓటీపీ (OTP)లను చోరీ చేస్తున్నారని తెలిపింది.

మోసగాళ్ల వ్యూహాలు – గమనించాల్సిన సంకేతాలు:

  • నకిలీ లింక్‌లు & ఏపీకే (APK) ఫైళ్లు: తెలియని నంబర్ల నుండి వచ్చే హెచ్చరికలు, ఐటీ పెనాల్టీ కట్టాలనే మెసేజ్‌లు లేదా యాప్‌లు డౌన్‌లోడ్ చేయమనే ఏపీకే ఫైళ్లను అస్సామాన్యంగా భావించి దూరంగా ఉండాలి.
  • వ్యక్తిగత సమాచారం: పాన్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఓటీపీలు అడిగే మెసేజ్‌లకు స్పందించకూడదు.
  • భయాందోళనలు సృష్టించడం: వెంటనే డబ్బులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ భయపెట్టే యత్నం చేస్తారు.

ముందస్తు జాగ్రత్తలు & ఫిర్యాదుల నంబర్లు:

“ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ కూడా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు లేదా ఈమెయిళ్ల ద్వారా ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్లు లేదా బ్యాంక్ వివరాలను అడగదు. పన్ను సంబంధిత వివరాలను కేవలం అధికారిక ప్రభుత్వ పోర్టల్ ద్వారా మాత్రమే తనిఖీ చేసుకోవాలి.”తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి

ఏదైనా సైబర్ మోసం జరిగాయని అనిపించినా లేదా నకిలీ మెసేజ్‌లు వచ్చినా వెంటనే క్రింది మార్గాల్లో ఫిర్యాదు చేయవచ్చు:

  • జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్: 1930
  • సైబర్ క్రైమ్ పోర్టల్: cybercrime.gov.in
  • తెలంగాణ సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ వాట్సాప్ నంబర్: 8712672222

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *