Breaking News

స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర: పట్టాభిరామ్

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా సాగనివ్వకుండా దాడులు, అరాచకాల ద్వారా అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర కుట్రలు పన్నుతోందని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. సకాలంలో ఈ ఎన్నికలు పూర్తి చేయకపోతే 16వ ఆర్థిక సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన రూ.12,500 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంటే, దానిని భంగపరచడానికి వైసీపీ యత్నిస్తోందని పట్టాభిరామ్ మండిపడ్డారు. పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి కిరాయి గూండాలు, షార్ప్ షూటర్లను రప్పించి పుంగనూరు, కడప, రాయచోటి తదితర ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. చిత్తూరులో వాకర్ సాయంతో నామినేషన్ వేయడానికి వచ్చిన వృద్ధురాలిపై దాడి చేసి పత్రాలు లాక్కోవడం వైసీపీ రాక్షసత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం నామినేషన్లను అడ్డుకుంటోందన్న వైసీపీ ప్రచారాన్ని ఆయన గణాంకాలతో ఖండించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తొలిరోజే వైసీపీ తరఫున 1,918 నామినేషన్లు పడ్డాయని, అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ (128) కంటే వైసీపీకే (192) ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయని గుర్తుచేశారు. అడ్డుకునే ఉద్దేశమే ఉంటే ఇన్ని నామినేషన్లు ఎలా పడతాయని ప్రశ్నించారు. 2020-21లో వైసీపీ పాలనలో 25 శాతం ఎంపీటీసీ, 20 శాతం జెడ్పీటీసీ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారని, ఆనాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన ప్రాణ రక్షణ కోసం కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వక్రీకరిస్తూ ఎన్నికలు వాయిదా పడ్డాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. పిటిషనర్ల వినతిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆ ఉత్తర్వు కాపీని మీడియాకు చూపించారు. ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరిస్తూ, “పీకలు కోస్తాం” అని బెదిరించిన వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *