అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని, రేపటిలోగా తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. తుపాను నష్టంపై ప్రాథమిక నివేదికను ఇవాళే అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాష్ట్రం ప్రస్తుతం ఒకవైపు రాయలసీమలో వర్షాభావం, మరోవైపు కోస్తా-ఉత్తరాంధ్రలో తుపాను రూపంలో డబుల్ కష్టాలను ఎదుర్కొంటోందని సీఎం వివరించారు. దెబ్బతిన్న, నీట మునిగిన పంటలను కాపాడేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని సూచించారు. పంట నష్టం అంచనాలకు సాంకేతికతను వినియోగించాలని, పంట నష్టం మినహా ఇతర బాధితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.

