డిజిటల్ అరెస్ట్ మరియు ఆన్‌లైన్ సైబర్ మోసాల బారిన పడుతున్న బాధితులకు బ్యాంకులే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సైబర్ నేరాలపై దాఖలైన సుమోటో పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. అమాయక ఖాతాదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఒక రక్షణ కవచంలా నిలవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పదవీ విరమణ పొందిన వ్యక్తుల ఖాతాల నుంచి ఒక్కసారిగా భారీ మొత్తంలో నగదు డ్రా అవుతున్నప్పుడు బ్యాంకులలో ఎలాంటి అలర్ట్ వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదని, తక్షణమే ఆ లావాదేవీలను నిలిపివేసే చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పందిస్తూ.. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేందుకు, కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేసేందుకు బ్యాంకులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటున్నాయని కోర్టుకు వివరించారు. నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ డిజిటల్ అరెస్ట్ కుంభకోణాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్న అమిసస్ క్యూరీ, సైబర్ నేరాల అడ్డుకట్టపై అన్ని రాష్ట్రాల పోలీసుల నుంచి సమగ్ర నివేదికలు మరియు సూచనలను కోరాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

