బీసీ మహిళలకు దక్కని అవకాశం..?
సొంత గ్రామ నిబంధనతో దరఖాస్తుకే నోచుకోని నిరుద్యోగ మహిళలు
పక్క గ్రామంలో పోస్టు ఉన్నా అప్లై చేయలేని పరిస్థితి..!
ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీసీ మహిళలకు నిరాశేనా..?
రిజర్వేషన్ ప్రక్రియపై పునరాలోచించాలంటున్న బీసీ సంఘాలు
ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూపులు
స్పెషల్ స్టోరీ
ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా విడుదలైన అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్లలో అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానంపై బీసీ సంఘాల నాయకులు, బీసీ మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో విడుదలైన పోస్టుల రిజర్వేషన్ కేటాయింపుల్లో బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీసీలకు అవకాశమెక్కడ..?
ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ ప్రాంత బీసీ మహిళలకు తాజా నోటిఫికేషన్ తీవ్ర నిరాశను మిగిల్చిందని బీసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొదటి విడతగా నోటిఫికేషన్ విడుదలైన పోస్టుల్లో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలకే కేటాయించారని వారు ఆరోపిస్తున్నారు.
దాదాపు 100కు 99 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పరిధిలోకి వెళ్లేలా కేటాయింపులు జరిగాయంటూ బీసీ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏ ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేశారని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రోస్టర్ విధానం, జనాభా ప్రాతిపదిక, గత నియామకాల బ్యాక్లాగ్ తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
పోస్టు కనిపిస్తోంది.. కానీ అప్లై చేయలేరు..!
అంగన్వాడీ పోస్టుల భర్తీలో అమలు చేస్తున్న స్థానిక గ్రామ నిబంధన కూడా బీసీ మహిళలకు మరో అడ్డంకిగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఏ గ్రామంలో అంగన్వాడీ టీచర్ లేదా హెల్పర్ పోస్టు ఖాళీగా ఉంటే అదే గ్రామానికి చెందిన మహిళ మాత్రమే ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండటంతో పక్క గ్రామాలకు చెందిన అర్హులైన మహిళలు అవకాశాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది.
ఒకే మండల పరిధిలో పక్కపక్కనే గ్రామాలు ఉన్నప్పటికీ… ఒక గ్రామంలో బీసీ మహిళలు అధిక సంఖ్యలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, మరో గ్రామంలో పోస్టు ఖాళీగా ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
“పోస్టు ఉంది… అర్హత ఉంది… ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంది… కానీ గ్రామం వేరు అనే ఒక్క కారణంతో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకపోతే ఎలా?” అంటూ పలువురు మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ఏళ్ల నిరీక్షణకు రిజర్వేషన్ బ్రేక్..?
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది బీసీ మహిళలు అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాల లేమి నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగం వస్తే కుటుంబానికి ఆసరాగా నిలవవచ్చని ఆశలు పెట్టుకున్నారు.
అయితే తాజా నోటిఫికేషన్లో తమ గ్రామానికి కేటాయించిన పోస్టు రిజర్వేషన్ పరిధిలోకి వెళ్లడంతో కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని పలువురు మహిళలు వాపోతున్నారు. మరోవైపు పక్క గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నా స్థానిక గ్రామ నిబంధన కారణంగా అక్కడ కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
‘రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు.. న్యాయమైన వాటా కావాలి’
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాంగబద్ధంగా, రోస్టర్ విధానం ప్రకారం న్యాయం జరిగేలా పోస్టుల కేటాయింపు ఉండాలని కోరుతున్నారు.
బీసీలకు దక్కాల్సిన అవకాశాలు తగ్గిపోయేలా రిజర్వేషన్ ప్రక్రియ ఉంటే ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో విడుదలైన అంగన్వాడీ పోస్టుల గ్రామాల వారీ రోస్టర్, రిజర్వేషన్ కేటాయింపు వివరాలను బహిర్గతం చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం పునరాలోచించాలి..!
అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల రిజర్వేషన్ ప్రక్రియపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. మొదటి విడత నోటిఫికేషన్లో జరిగిన కేటాయింపులను సమగ్రంగా పరిశీలించి బీసీ మహిళలకు కూడా న్యాయమైన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
అవసరమైతే మండలాన్ని యూనిట్‌గా తీసుకుని అర్హులైన మహిళలకు పక్క గ్రామాల్లోని పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సూచిస్తున్నాయి. లేదా గ్రామాల వారీ రిజర్వేషన్ రోస్టర్ అమలుపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచి అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న బీసీ మహిళల ఆశలు తాజా నోటిఫికేషన్‌తో ఆవిరైపోతాయా..? రిజర్వేషన్ కేటాయింపులపై ప్రభుత్వం వివరణ ఇస్తుందా..? బీసీ సంఘాల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃసమీక్షిస్తుందా..? ఇప్పుడు ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది.
బీసీ సంఘాల ప్రధాన డిమాండ్లు
బీసీ మహిళలకు న్యాయమైన అవకాశాలు కల్పించాలి.
- స్థానిక గ్రామ నిబంధనపై పునరాలోచించాలి.
- అర్హత ఉన్న మహిళలకు మండల పరిధిలో దరఖాస్తు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలి.
- పోస్టుల భర్తీకి ముందు రిజర్వేషన్ ప్రక్రియను ప్రభుత్వం పునఃసమీక్షించాలి.

