Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అరెస్టా?

ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్, జూలై 22:E6 tv NEWS శివ ఠాకూర్: విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం జరిగే శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకల కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించాలని పేర్కొన్నారు.విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీని అడ్డుకుని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్య అని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం చర్చలను తప్పించుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత నుంచి తప్పించుకోవడమేనని అన్నారు.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కులని గుర్తుచేసిన ఎమ్మెల్యే, అలాంటి హక్కులను అణచివేసే చర్యలు దేశ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు వాస్తవాలను వివరించి, బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *