Breaking News

దళిత స్పీకర్‌పై అసభ్య పదజాలం సరికాదు

బీఆర్ఎస్ నేతల దురహంకారానికి పరాకాష్ట.. బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం

బాల్కొండ, సెప్టెంబర్ 8: (E6 tv NEWS: ప్రతినిధి).

శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అసభ్యకర, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత గౌరవనీయమైన పదవి అని అన్నారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ స్పీకర్ పదవిని, వ్యక్తిగత గౌరవాన్ని, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అసభ్య పదజాలం ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక, ప్రజలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకులు ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దళిత స్పీకర్‌ను అవమానించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా దళితుల ఆత్మగౌరవాన్ని, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు.ఇలాంటి దురహంకారపూరిత వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన, ప్రజాస్వామ్యపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పదవులు, రాజకీయాలు శాశ్వతం కావు.. కానీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక గౌరవం శాశ్వతం. వాటిని అవమానించే ఏ శక్తినైనా ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ఎదుర్కొంటాం” అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్‌తో పాటు సర్పంచులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *