అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ కాలం చుక్కలు చూపిస్తోంది. అమెరికా గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) విడుదల చేసిన తాజా ఫెడరల్ ఆడిట్ నివేదిక ప్రకారం… భారత్‌లో విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటున 346 రోజులు (దాదాపు ఏడాది) వేచి చూడాల్సి వస్తోంది. కరోనాకు ముందు కేవలం 42 రోజులుగా ఉన్న ఈ సమయం ఇప్పుడు ఎనిమిది రెట్లకు పైగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా 14.55 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించడానికి దేశవ్యాప్తంగా కేవలం 68 మంది కాన్సులర్ అధికారులు మాత్రమే అందుబాటులో ఉండటమే ఈ తీవ్ర ఆలస్యానికి ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వీసా వెయిటింగ్ పీరియడ్ ఉన్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. చైనాలో విజిటర్ వీసా ఇంటర్వ్యూకు సగటున 34 రోజులు, బ్రెజిల్లో 32 రోజులు పడుతుండగా… భారత్‌లో మాత్రం 346 రోజులు పడుతుండటం గమనార్హం. దరఖాస్తుల సంఖ్యకు తగ్గట్లు కాన్సులర్ సిబ్బంది లేకపోవడం, న్యూఢిల్లీ ఎంబసీలో మౌలిక సదుపాయాల పరిమితులు, కొంతమంది వీసా ఏజెంట్లు అపాయింట్మెంట్ స్లాట్లను ముందస్తుగా బ్లాక్ చేయడం వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు శనివారాలు కూడా పనిచేయడం, వాషింగ్టన్ ద్వారా ఇంటర్వ్యూ వేవర్ (డ్రాప్‌బాక్స్) కేసులను ప్రాసెస్ చేయడం వంటి చర్యలను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ చేపడుతోంది.

