Breaking News

నిమ్స్‌లో ఏసీబీ కలకలం: అధికారుల ఇళ్లలో ముమ్మర సోదాలు!

హైదరాబాద్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం నిమ్స్ ఆసుపత్రిలోని పలువురు ఉద్యోగుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించి రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే లక్ష్మీ భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ, ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగిస్తోంది.

డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించి రూ. 6.13 కోట్ల నమోదు విలువ కలిగిన ఆస్తులను ఏసీబీ గుర్తించగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. సోదాల్లో 517.8 గ్రాముల బంగారం, జాగ్వార్, ఆడీ కార్లతో పాటు కూకట్‌పల్లి, మణికొండల్లో విలాసవంతమైన ఫ్లాట్లు, విశాఖపట్నంలో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. అలాగే బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌లో దాదాపు రూ.1.17 కోట్ల వరకు పొదుపు, పెట్టుబడులను అధికారులు కనుగొన్నారు. ఆసుపత్రి అడ్మిషన్లు, ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో కమీషన్ల ద్వారా ఈ అక్రమార్జనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న అధికారులు, ఇతర ఉద్యోగుల ప్రమేయంపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *