ముంబైలోని సియోన్ అనిక్ బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలో వరుసగా నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 10 ఎలక్ట్రిక్ బస్సులు దెబ్బతిన్నాయి. ఒక బస్సులో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వేగంగా వ్యాపించడంతో డిపో ప్రాంగణమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
బ్యాటరీ వ్యవస్థలో సాంకేతిక లోపం, ఛార్జింగ్ సమస్యలు లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రమాదం డిపోల్లో ఫైర్ సేఫ్టీ, బ్యాటరీ పర్యవేక్షణ మరియు ఛార్జింగ్ వ్యవస్థల భద్రతా ప్రమాణాలపై మరొకసారి తీవ్ర చర్చకు దారితీసింది. అధికారులు ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై సమగ్ర విచారణ చేపడుతున్నారు.

