తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే సాగునీరు, విద్యుత్ లేక రైతుల పంటలు ఎండిపోయి కరవు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల నిజమైన సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలను ఓ పెద్ద డ్రామాగా అభివర్ణించారు. నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం గతంలోనే స్పష్టం చేసినప్పుడు తుమ్మిడిహెట్టి నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన.. ఈ ప్రాజెక్టు డీపీఆర్, ఖర్చు మరియు ఆయకట్టు వివరాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టాలపై మంత్రులు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పకుండా కేటీఆర్, హరీశ్ రావులపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
తుమ్మిడిహట్టి చర్చలు డ్రామా: కాంగ్రెస్‌పై బాల్క సుమన్ ఫైర్

