తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అంశం మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కమ్’ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 17 పై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ జీవో వల్ల భవిష్యత్తులో ఉచిత విద్యుత్ విధానానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త డిస్కమ్ ఏర్పాటు జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హరీశ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ కనెక్షన్లు కలిపి మొత్తం 30,62,853 కనెక్షన్లు బదిలీ కానున్నాయి. రాష్ట్రంలో ఉన్న 6,15,651 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్ల నిర్వహణకు కేవలం రెండు వేల మంది సిబ్బంది సరిపోరని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
అలాగే విద్యుత్ కేటాయింపులపై కూడా హరీశ్ రావు పలు అనుమానాలు లేవనెత్తారు. కొత్త డిస్కమ్‌కు కేటాయించిన 58 శాతం సోలార్ విద్యుత్ కేవలం పగటి పూట మాత్రమే అందుబాటులో ఉంటుందని, రాత్రి వేళల్లో విద్యుత్ ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. 2,325 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి వర్షాకాలంలో మాత్రమే సాధ్యమవుతుందని, మిగిలిన రోజుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటని నిలదీశారు. భవిష్యత్తులో ఈ సంస్థకు వచ్చే నష్టాలను సాకుగా చూపి ఉచిత విద్యుత్‌పై ఆంక్షలు విధిస్తారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
నూతన డిస్కమ్ ఏర్పాటు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, ఆర్థిక భారం, ఉచిత 24 గంటల విద్యుత్ కొనసాగింపుపై ప్రభుత్వం తక్షణమే లిఖితపూర్వక హామీ ఇవ్వాలని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. నాణ్యమైన విద్యుత్ అందించడం వదిలేసి, సంస్థల పేర్లు మారుస్తూ రైతులను గందరగోళానికి గురిచేయవద్దని, స్పష్టత ఇవ్వకపోతే జీవో 17ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

