ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం దేశంలో మరో స్వాతంత్య్ర ఉద్యమం వంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ‘సైమన్ గో బ్యాక్’ అన్నట్టే.. ఇప్పుడు ‘జ్ఞానేశ్ గో బ్యాక్’, ‘ఎస్‌ఐఆర్ గో బ్యాక్’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘ఓటు బచావో… దేశ్ బచావో’ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌తో కుమ్మక్కై ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) పేరుతో అర్హులైన ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి హయాంలో జరిగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలు ఓట్లు లేనివారికి హక్కు కల్పించేలా ఉండేవి తప్ప, ఉన్న ఓట్లను తొలగించేలా కావని ఆయన గుర్తుచేశారు.
ప్రత్యర్థులను అణచివేసేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను వాడుకున్న కేంద్రం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వంటి స్వతంత్ర వ్యవస్థలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని మండిపడ్డారు. 2023లో ఈసీ నియామక కమిటీ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, హోంమంత్రిని చేర్చడం ద్వారా వ్యవస్థల పారదర్శకతను దెబ్బతీశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు మరియు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

