ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సాంకేతికంగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100కి పైగా ప్రధాన పర్యాటక, పుణ్యక్షేత్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. స్పెయిన్‌లోని సెవిల్లెలో బుధవారం జరిగిన ‘టూరిజం ఇన్నోవేషన్ సమిట్-2026’లో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ వివరాలను వెల్లడించారు. ఎక్స్‌ప్లర్గర్ (Explurger) భాగస్వామ్యంతో ‘NiVU AI’ సాంకేతికతను రూపొందించారని, పర్యాటకులు ఎటువంటి యాప్ డౌన్‌లోడ్ చేయకుండా లేదా డబ్బులు చెల్లించకుండా కేవలం “ASK AI” క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో సమాచారాన్ని పొందే వీలుంటుందని ఆయన తెలిపారు.
మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించగా, తొలిదశలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో అమలు చేయనున్నారు. ఈ సాంకేతికత విదేశీ పర్యాటకులకు సైతం వారి సొంత భాషలోనే స్థానిక సంస్కృతి, చరిత్రను వివరించడమే కాకుండా, పర్యాటక శాఖకు పర్యాటకుల ప్రాధాన్యతలను విశ్లేషించే డేటాను అందిస్తుంది. ఏపీలో ఆధ్యాత్మిక ప్రదేశాలు, బౌద్ధ క్షేత్రాలు, అరకూ, గండికోట, విశాఖపట్నం బీచ్‌లు వంటి ఎన్నో ప్రాచుర్యం పొందిన ప్రాంతాలు ఉన్నాయని తెలిపిన మంత్రి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పర్యాటక సంస్థలకు పిలుపునిచ్చారు.

