ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి భాగస్వామ్య పక్షాలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమై దాదాపు రెండు గంటల పాటు కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో స్థానిక ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయ కమిటీల ఏర్పాటుపై సుదీర్ఘంగా సమాలోచనలు నిర్వహించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు సుప్రీంకోర్టులోని తాజా పరిణామాలపై చర్చించిన నేతలు, క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు మరియు నాయకుల ప్రభావం ఆధారంగా విజయావకాశాలే ప్రామాణికంగా సమన్వయంతో ముందడుగు వేయాలని నిర్ణయించారు. కూటమి బలాన్ని నిరూపించుకుంటూ వంద శాతం గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఇరువురు నేతలు ఖరారు చేశారు.
ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి బిగ్ ప్లాన్!

