హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లలో ప్రయాణించడానికి ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న ‘కామన్ మొబిలిటీ కార్డ్’తో పాటు ‘మీ టికెట్’ (Me Ticket) యాప్‌ను గాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్ 2) మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ విధానం ద్వారా కాగితపు టికెట్ల ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా చిల్లర సమస్యకు ముగింపు పడనుంది. ‘మీ టికెట్’ యాప్ ద్వారా చెల్లింపు పూర్తి చేయగానే డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ టికెట్ జనరేట్ అవుతుంది. దానిని బస్సులో చూపిస్తే సరిపోతుంది. అలాగే బస్ పాస్ కేంద్రాలకు వెళ్లే పనిలేకుండా రూ. 600 ప్రారంభ ధరతో వారం రోజుల పాటు అన్ని బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేసేలా ‘డిజిటల్ వీక్లీ బస్ పాస్’ సౌకర్యాన్ని కూడా ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

