హైదరాబాద్‌లో GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగడంతో గాంధీ భవన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది బాధితులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఉద్యోగులు స్థానికతను కోల్పోయి, కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, సీనియారిటీ సమస్యలు కూడా వేధిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ నిరసనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
బాధితులు గాంధీ భవన్ వైపు దూసుకురావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమను వెంటనే సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, స్థానికత ఆధారంగా న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలను విరమించేది లేదని బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్చలకు పిలవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

