ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సైబర్ దాడికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 3,897 మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు ఎస్బీఐ బుధవారం అధికారికంగా తెలిపింది. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం.. వెల్లడైన సమాచారంలో కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ ఐడీలు, నివాస చిరునామాలు, కస్టమర్ ఐడీలతో పాటు వారి రుణాల (లోన్ల) వివరాలు ఉన్నట్లు బ్యాంక్ గుర్తించింది.
ఈ డేటా లీక్ తీవ్రతను, దాని వెనుక ఉన్న కారణాలను సమగ్రంగా విచారించేందుకు ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. అయితే, ఈ ఘటన వల్ల బ్యాంక్ ప్రధాన వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక స్థితి లేదా సేవల కొనసాగింపుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఆర్థిక సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

