Breaking News

పేదరిక నిర్మూలనే నా ధ్యేయం: బాపట్ల సభలో సీఎం

బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలను సవరించి పేద ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. తాను కూడా ఇతర నాయకుల్లా కార్యాలయానికే పరిమితమై బటన్లు నొక్కవచ్చని, కానీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ప్రతినెల వారి మధ్యకు వస్తున్నానని తెలిపారు. తమ ప్రభుత్వంలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని అభివర్ణించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు పింఛన్ల రూపంలో రూ.76,000 కోట్లు అందించామని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో పాలకులు రాష్ట్రాన్ని తీవ్రంగా విధ్వంసం చేశారని, ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో ప్రజలు కూటమికి 54 శాతం ఓట్లు, 94 శాతం సీట్లు ఇచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారని కొనియాడారు. అసెంబ్లీకి రాకుండా అలిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ, కూటమి గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం ద్వారా ప్రజలకు శాశ్వత ఉపశమనం కలిగిస్తున్నామని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *