వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఉన్న సీబీఐ కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మోపిన కేసులను కూడా వేగవంతం చేస్తూ రోజువారీ (Day-to-Day) ప్రాతిపదికన విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న 9 ఈడీ ఛార్జిషీట్లపై విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఈడీ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం, అలాగే నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంపై విచారణ త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దీనిలో భాగంగా జగన్‌తో పాటు మరో 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేందుకు న్యాయస్థానం సమాయత్తమవుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసు: ఇకపై రోజువారీ విచారణ!

