Breaking News

మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తాగునీరు, ఇతర కనీస సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు, ఈ సాయంత్రం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఇంద్రకీలాద్రిని సందర్శించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దసరా ఉత్సవాల వేళ ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *