బిహార్ రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా వస్తున్న నీటితో నదులు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా గండక్ నది తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో కరకట్టలు తెగిపోయి లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. ప్రవాహం రహదారులను సైతం ముంచెత్తడంతో పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మరోవైపు గంగా నది కూడా ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ముంపు పెరిగిన జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బోట్ల సహాయంతో నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసి, బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి. పరిస్థితి మరింత విషమించకుండా కరకట్టలు, నీటిమట్టాలపై యంత్రాంగం నిరంతర నిఘా ఉంచింది.

