రాయలసీమను దేశంలోనే ప్రధాన ఫల దిగుబడి, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కింద 10 జిల్లాల్లోని 303 మండలాలు, 5,869 గ్రామాలను కలిపి 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
ఉద్యానవన సాగు విస్తీర్ణాన్ని ప్రస్తుతం ఉన్న 8.41 లక్షల హెక్టార్ల నుండి 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం, ఉత్పత్తిని 222 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 435 లక్షల మెట్రిక్ టన్నులకు చేర్చడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ భాగస్వామ్యం కింద కేటాయించే ₹40,352 కోట్లలో సాగునీటి ప్రాజెక్టులకు ₹20,884 కోట్లు, ఉద్యాన అభివృద్ధికి ₹15,000 కోట్లు, రహదారుల నిర్మాణానికి ₹4,562 కోట్లు వెచ్చిస్తారు. దీనికి తోడు ప్రైవేట్ రంగం నుండి మరో ₹60,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నారు. మామిడి, అరటి, టమాటో, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో వంటి పంటల సాగును ప్రోత్సహిస్తూ, సాగునీరు, డ్రిప్ ఇరిగేషన్, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు ఎగుమతి సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ‘రైస్ బౌల్’తో పాటు ‘ఫ్రూట్ బౌల్’గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

