Breaking News

సరాకా గ్యాస్ లీక్ విషాదం.. రూ. కోటి పరిహారం ఇవ్వాలన్న హరీశ్‌రావు!

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక కెమికల్ పరిశ్రమలో సంభవించిన గ్యాస్ లీక్ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు.. ప్రభుత్వ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే పదేపదే ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో జరిగిన సిగాచీ ప్రమాదం నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఆయన విమర్శించారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

కార్మికుల భద్రతను గాలికొదిలేసి, ప్రమాదాలు జరిగిన తర్వాతే అధికారులు తూతూమంత్రంగా ఫొటోలకు పోజులివ్వడానికి వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో జీవనోపాధి కోల్పోయిన 54 కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని హరీశ్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *