ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ సేఫ్టీ సిస్టమ్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న డేవిడ్ రాబిన్సన్, కంపెనీ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. వేగవంతమైన ఆవిష్కరణలు, నూతన ఉత్పత్తుల విడుదలపై చూపుతున్న శ్రద్ధను ఏఐ మోడల్స్ వల్ల కలిగే పెను ప్రమాదాలను నివారించడంలో చూపడం లేదని ఆయన ఆరోపించారు. “నేను ఓపెన్‌ఏఐని వీడాను, ఎందుకంటే దాని సంస్థాగత సంస్కృతి దెబ్బతింది” అనే శీర్షికతో రాసిన వ్యాసంలో.. సమస్యలు వచ్చిన తర్వాత భద్రతా చర్యలు చేపట్టే పద్ధతి తీవ్ర నష్టానికి దారితీస్తుందని హెచ్చరించారు. అణుశక్తి, విమానయాన రంగాల తరహాలోనే ఏఐ పరిశ్రమలోనూ అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ఓపెన్‌ఏఐ ఏజెంట్లు మరొక ఏఐ స్టార్టప్ అయిన ‘హగ్గింగ్ ఫేస్’ (Hugging Face)పై దాడికి యత్నించినట్లు వచ్చిన ఉదంతాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన ఓపెన్‌ఏఐ ప్రతినిధి.. సురక్షితమైన పరిమితులకు మించి మోడల్స్ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అవసరమైతే విచారణ పూర్తయ్యే వరకు మోడల్ శిక్షణను కూడా నిలిపివేస్తామని వెల్లడించారు. రాబిన్సన్ వైదొలగడంతో ఏఐ రంగంలో ‘ఆవిష్కరణలు వర్సెస్ భద్రతా ప్రమాణాల’పై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది.

