ప్రజాదరణ పొందేలా సుపరిపాలన అందించడానికి సాంకేతికత, నాయకత్వం, నైపుణ్యాలు మరియు ఆవిష్కరణలను మేళవించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన సాంకేతికతల ద్వారా భారతదేశ సమగ్ర అభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. నిరంతర శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
iGOT-కర్మయోగి పోర్టల్ ద్వారా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఏకంగా రెండు కోట్లకు పైగా కోర్సులను పూర్తి చేసి, దేశంలోనే కెపాసిటీ బిల్డింగ్‌లో ప్రథమ స్థానంలో నిలవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక శాఖ ప్రాన్సిపల్ కార్యదర్శి పీయూష్ కుమార్‌తో పాటు కర్ణాటక (రెండో స్థానం), ఒడిశా (మూడో స్థానం) ప్రతినిధులకు పురస్కారాలను అందజేశారు. విపత్తులు, పండుగల నిర్వహణలో ఉద్యోగుల సేవలను కొనియాడిన ఆయన, వేగవంతమైన నిర్ణయాల కోసం శాఖల మధ్య నిరంతర సమాచార మార్పిడి అవసరమని ఉద్ఘాటించారు.

