Breaking News

2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్‌: అమిత్ షా

న్యూఢిల్లీ: దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు పోలీసు బలగాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బుధవారం న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నిర్వహించిన “పోలీస్ సంస్మరణ దినోత్సవం”లో పాల్గొని ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2029 డిసెంబర్ 31 నాటికి దేశంలో నార్కోటిక్స్ (మాదకద్రవ్యాలను) పూర్తిగా నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించారని వెల్లడించారు. 2026లోని మిగిలిన నెలలతో పాటు 2027, 2028, 2029 సంవత్సరాలను డ్రగ్స్‌పై ఉమ్మడి పోరాటానికి కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. మత్తు పదార్థాలు భావి తరాల భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా, దేశ వ్యతిరేక శక్తులకు ఆర్థికంగా మద్దతునిస్తున్నాయని హెచ్చరించారు.

దశాబ్దాలుగా వేధిస్తున్న నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి దేశం విజయవంతంగా నిర్మూలించిందని, ఈ పోరాటంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు మరియు సీఏపీఎఫ్ కీలక పాత్ర పోషించాయని అమిత్ షా కొనియాడారు. 1981 నుంచి 2026 మార్చి వరకు నక్సల్స్ హింసలో 3,600 మందికి పైగా భద్రతా సిబ్బంది, దాదాపు 13,700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అనంతరం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహనలో భాగంగా దాదాపు 90 మంది పోలీస్ రైడర్లతో కూడిన “ఫైట్ ఎగైనెస్ట్ డ్రగ్స్” బైక్ ర్యాలీని హోంశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ ర్యాలీ గుజరాత్‌లోని ఏక్తా నగర్‌కు చేరుకుని, అక్టోబర్ 31న జరిగే “ఏక్తా పరేడ్”లో పాల్గొంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *