హైదరాబాద్: తెలంగాణలో బతుకమ్మ వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం గ్రామంలో బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా.. భారీ శబ్దంతో మోగుతున్న డీజే సౌండ్ కారణంగా యాళగడ భారతి (55) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డీజే హై-వాల్యూమ్ శబ్దం వల్లే ఆమె గుండె ఆగిపోయి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఘటనలో, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బూరుగడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీవాణి (25) బతుకమ్మ పండుగ కోసం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. వేడుకల్లో భాగంగా ఉత్సాహంగా నృత్యం చేస్తుండగా ఆమె కిందపడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండుగ వేళ జరిగిన ఈ వరుస ఘటనలతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

