Breaking News

జగన్‌కు షాక్.. సొంత జిల్లాలో టీడీపీ ఖాతాలోకి 6 మున్సిపాలిటీలు!

అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి కడప జిల్లాలోని కీలక మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ముఖ్యంగా రాయచోటిలోని మొత్తం 44 వార్డులను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకోవడం విశేషం. మిత్రపక్షమైన బీజేపీకి ఎర్రగుంట్ల మున్సిపాలిటీని కేటాయించి కూటమి ఐక్యతను చాటుకుంది. అంతేకాకుండా, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీపై కూడా టీడీపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

అయితే, ఈ ఏకగ్రీవాలపై వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార కూటమి అక్రమాలు, దౌర్జన్యాలతో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుందని, కొన్నిచోట్ల నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, ఈ విజయాలపై కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పందిస్తూ.. ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలు సరికొత్త రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పరిణామాలు చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ఫలితాలు కడప జిల్లా రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *