Breaking News

ఇన్ని రోజులు చేయని నిరసన దీక్ష ఇప్పుడే ఎందుకు చేపట్టారు?

ఎంపీ ధర్మపురి అరవింద్‌పై నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శలు

నిజామాబాద్,అక్టోబర్ 27:(E6tv న్యూస్).ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టిన నిరసన ధర్నా రాజకీయ ప్రయోజనాల కోసమేనని నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు. ఇన్ని రోజులు చేయని నిరసన దీక్షను ఇప్పుడే ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. సంక్రాంతి సమయంలో గంగిరెద్దుల వారు ఇంటి వద్దకు వచ్చి చప్పుడు చేసినట్లుగా, ఎంపీ అరవింద్ కూడా ఏదో ఒక అంశంపై హడావుడి చేయడం అలవాటుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

ధర్నాలో పాల్గొనేందుకు పాఠశాల విద్యార్థులను బలవంతంగా తీసుకొచ్చి, వారి విలువైన సమయాన్ని, చదువును రాజకీయ స్వార్థం కోసం వృథా చేశారని ఆరోపించారు. పాఠశాల యాజమాన్యాన్ని బెదిరించి విద్యార్థులను ధర్నాలో కూర్చోబెట్టారని విమర్శించారు. ధాన్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యాపారులు మినహా, ఇతర వాణిజ్య సంస్థలు ధర్నాకు మద్దతుగా ముందుకు రాలేదని పేర్కొన్నారు.ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా అభివృద్ధికి నిధుల మంజూరుపై చర్చించారని రామకృష్ణ తెలిపారు. త్వరలోనే నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆ పనుల ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకే ఎంపీ అరవింద్ ధర్నా చేపట్టారని ఆరోపించారు.

ఇటీవల నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధి విషయంలో మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన విషయాన్ని రామకృష్ణ గుర్తుచేశారు. అయినప్పటికీ ఎంపీ అరవింద్‌తో కలిసి ధర్నాలో పాల్గొనడంపై ఎమ్మెల్యే తన వైఖరిని పునరాలోచించుకోవాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే స్వాగతించాల్సింది పోయి, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడేలా ధర్నాలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ అరవింద్ నిధులు తీసుకొస్తే స్వాగతిస్తామని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి చేసే విధానం తెలుసని, గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన అరవింద్‌కు కూడా ఆ విషయం తెలుసని వ్యాఖ్యానించారు.

మున్సిపల్ కార్యాలయంలో నిధుల విడుదలపై ఇటీవల ధర్నా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అంతకుముందే కౌన్సిల్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం అనే తేడా లేకుండా అన్ని డివిజన్ల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. అదే నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ఎంపీ అరవింద్, కొబ్బరికాయలు కొట్టేందుకు ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ వెళ్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఎమ్మెల్యేగా ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పాఠశాల విద్యార్థులను రాజకీయ నిరసనల్లో భాగస్వాములను చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ధర్నాల ద్వారా ప్రజల సానుభూతి పొందాలని ఎంపీ అరవింద్ ప్రయత్నిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే ఆయనకు తగిన సమాధానం చెబుతారని బొబ్బిలి రామకృష్ణ వ్యాఖ్యానించారు.

– నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *