Breaking News

స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ దాడులు..జి. పుల్లారెడ్డి స్వీట్స్ క్లోజ్!

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లోని పలు ప్రముఖ స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. తీవ్రమైన అపరిశుభ్రత, కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని గుర్తించి, నగరంలో ఎంతో పేరున్న ‘జి. పుల్లారెడ్డి స్వీట్స్’తో పాటు మరో నాలుగు సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 16 ప్రధాన స్వీట్ షాపుల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తంగా రూ. 16.86 లక్షల విలువైన 3,546 కిలోల కల్తీ, పాడైపోయిన ఆహార పదార్థాలను టీజీ సేఫ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.

సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ యూనిట్‌లో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలను అధికారులు గుర్తించి, అక్కడి నుంచే ఏకంగా రూ. 15.03 లక్షల విలువైన ఆహారాన్ని సీజ్ చేశారు. పుల్లారెడ్డి స్వీట్స్‌తో పాటు చార్మినార్‌లోని ఆగ్రా మిఠాయి ఘర్, వనస్థలిపురంలోని స్వీట్ వన్ రుచులు, ఫలక్‌నుమాలోని బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, కాటేదాన్‌లోని హిరాణి ఫుడ్స్ లైసెన్సులను సస్పెండ్ చేయగా.. లైసెన్సులు లేకుండా నడుస్తున్న మరో 5 షాపులను పూర్తిగా మూసివేయించారు. తనిఖీల్లో సేకరించిన 22 ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించిన అధికారులు, నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *