Breaking News

దీపావళి సందడి షురూ.. టపాసుల దుకాణాలపై ఫైర్ సేఫ్టీ నజర్!

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలో టపాసుల విక్రయాలకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. పండుగ వేళ ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. నగరంలో 50 తాత్కాలిక క్రాకర్స్ దుకాణాలకు, ఆర్మూర్‌లో మరో రెండు దుకాణాలకు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి టీ. పరమేశ్వర్ తెలిపారు. నిబంధనల ప్రకారం మున్సిపల్ అధికారులు సూచించిన ఓపెన్ గ్రౌండ్లలోనే, రేకుల షెడ్లు మరియు ఐఎస్ఐ మార్క్ విద్యుత్ వైరింగ్‌తో ఈ దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ప్రమాదాలు జరగకుండా ప్రతి దుకాణంలో 200 లీటర్ల నీటి డ్రమ్ము అందుబాటులో ఉంచాలని, ఒకేసారి 500 కిలోలకు మించి టపాసులు నిల్వ చేయకూడదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 8 శాశ్వత క్రాకర్స్ దుకాణ సముదాయాలు, 11 అధీకృత గోదాములు ఉన్నాయి. గోదాముల్లో ఫైర్ పైప్‌లైన్లు, స్ప్రింక్లర్లు, 20 వేల లీటర్ల నీటి సంపు వంటి భద్రతా సదుపాయాలు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. పోలీస్, ఫైర్, మున్సిపల్ సహా సంబంధిత శాఖల అనుమతులు పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *