Breaking News

యూరియా కొరత తర్వాత కరెంట్ కష్టాలు: తెలంగాణలో రోడ్డెక్కిన రైతన్నలు!

హైదరాబాద్ :

గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, ఈ సీజన్‌లో తీవ్రమైన యూరియా కొరతతో అల్లాడిపోయిన తెలంగాణ రైతాంగానికి ఇప్పుడు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కరెంట్ రోజుకు కొద్ది గంటలు కూడా సక్రమంగా రాకపోవడం, ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలకు దిగుతున్నారు.

జిల్లాల్లో మిన్నంటిన నిరసన జ్వాలలు

  1. యాదాద్రి భువనగిరి జిల్లా:సుద్దాల గ్రామానికి చెందిన రైతులు స్థానిక సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. క్షేత్రస్థాయిలో బోరుబావుల కింద పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న 24 గంటల కరెంట్ మాట దేవుడెరుగు.. కనీసం 18 గంటలైనా నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై నినాదాలు చేశారు.
  2. నల్గొండ జిల్లా:ఇండ్లూరు గ్రామానికి చెందిన రైతులు తిప్పర్తి-నకిరేకల్ రహదారిపై సబ్‌స్టేషన్ ఎదుట ‘రాస్తారోకో’ నిర్వహించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా కరెంట్ కోతల సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
  3. జగిత్యాల జిల్లా:కోరుట్ల-ఐలాపూర్ రహదారిపై రైతులు భారీ నిరసన చేపట్టారు. రోజుకు కేవలం 9 నుండి 10 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని, వర్షాలు లేక తల్లడిల్లుతుంటే ఉన్న విద్యుత్‌ను కూడా సరిగ్గా ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.
  4. వరంగల్ జిల్లా:మైలారం గ్రామంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ (SRSP) ద్వారా సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళన బాట పట్టారు.

స్వయంగా బోర్ల కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తుండటంతో, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అప్రకటిత కోతలకు స్వస్తి పలకాలని రైతాంగం తీవ్రంగా హెచ్చరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *