Breaking News

అభివృద్ధి ముసుగులో భూసేకరణ: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్

హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బహదూర్‌పల్లిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల వ్యవసాయ భూములను అక్రమంగా తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ అభివృద్ధికి గానీ, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు గానీ వ్యతిరేకం కాదని, అయితే రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా, ఒక్క రైల్వే స్టేషన్ కోసం వెయ్యి ఎకరాల రైతుల భూములను ఎందుకు సేకరిస్తున్నారని ఆయన నిలదీశారు.

రైతుల భూములను లాక్కోవడానికి సుమారు 4,000 మంది పోలీసులను మోహరించి భయాందోళనలు సృష్టించడాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రభుత్వం వద్ద సరైన పత్రాలు ఉంటే రైతులకు చూపించాలి తప్ప పోలీసులతో భయపెట్టకూడదని హితవు పలికారు. ఏడాదిన్నరలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రైతుల భూముల పట్టాలను వారికే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా, రాజకీయంగా పూర్తి అండగా నిలుస్తుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *