విజయవాడలోని పటమట డొంకరోడ్డులో ఓ వాటర్ బాటిల్ కోసం జరిగిన కిరాతక ఘటన తీవ్ర కలకలం రేపింది. వాటర్ బాటిల్ దొంగిలించేందుకు ప్రయత్నించాడనే అనుమానంతో నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33) అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు చేతులు వెనక్కి విరిచి విద్యుత్ స్తంభానికి కట్టేసి, సుమారు రెండు గంటల పాటు చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు.
అక్టోబర్ 19న తెల్లవారుజామున 2 గంటల సమయంలో సాయికుమార్ స్థానికంగా ఉన్న ఓ పాన్‌షాప్ వద్ద తాళం వేసి ఉన్న ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ తీసేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన ఓ పాలవ్యాన్ డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పాన్‌షాప్ యజమాని రవిశంకర్, మరో వ్యక్తి అయ్యప్పతో కలిసి సాయికుమార్‌ను మద్యంషాపు వెనక ఉన్న సందులోకి ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఇద్దరూ కలిసి అతని చేతులను వెనక్కి విరిచి విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టడం ప్రారంభించారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఈ దాడిలో జతకలిశారు. తనకు భార్యాపిల్లలు ఉన్నారని, వదిలేయాలని సాయికుమార్ ఎంతగా వేడుకున్నా ఏమాత్రం కనికరం లేకుండా నలుగురూ కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సాయికుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఉదయం రక్తపు గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు మృతుడిని సాయికుమార్‌గా గుర్తించి, దాడికి పాల్పడిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు మరియు ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

