Breaking News

తుమ్మిడిహట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ సమీక్ష

రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో జరగనున్న చర్చలకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ప్రధానంగా తుమ్మిడిహట్టి, దిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే అవకాశం ఉంటుందని, దీనివల్ల 2,300 ఎకరాల ముంపు ఉంటుందని అధికారులు తెలిపారు. అదే 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ముంపు వెయ్యి ఎకరాల లోపే ఉంటుందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేస్తూనే, తెలంగాణకు గరిష్ఠంగా నీటి లభ్యత ఉండేలా బ్యారేజీ డిజైన్‌ను రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 23 తర్వాత చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర సీఎం సంకేతాలిచ్చారని, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కోరే ఎలాంటి సమాచారానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు.

దిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం నుంచి అదనంగా 0.6 టీఎంసీల నీటిని తీసుకునేందుకు, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డి. శ్రీధర్ బాబు, సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *