Breaking News

ఎల్ నినో, కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం – హరీశ్‌రావు

తెలంగాణలో కరువు మరియు ఎల్ నినో ప్రభావంపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రైతులతో నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ను పదే పదే మార్చడం, రద్దు చేయడం చూస్తుంటే ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.

  • యాసంగి పంటలపై స్పష్టత ఏది?: ఎల్‌నినోపై ప్రపంచ శాస్త్రవేత్తలు, కేంద్ర సంస్థలు గత 9 నెలలుగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. యాసంగిలో పంటలు వేయవద్దంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించాలని, రైతులు, వ్యవసాయ కూలీల జీవనాధారం కోసం తక్షణమే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజలు ఉపాధి కోసం మళ్లీ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • విద్యుత్ కోతలు, ఎండిపోతున్న పంటలు: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ముందస్తుగా బొగ్గు నిల్వలు ఏర్పాటు చేసుకోకపోవడం, కొనుగోలు ఒప్పందాలు చేసుకోకపోవడం వల్లే పలు ప్రాంతాల్లో ఆరు గంటలు కూడా విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
  • ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం: ప్రాజెక్టులలో నీటి లభ్యత ఉన్నప్పటికీ దేవాదుల, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను సక్రమంగా వినియోగించడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోవడం వల్ల నీటి నిల్వలు పడిపోయాయని, ప్రజలకు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉన్న సమయంలో మద్యం తయారీ కంపెనీలకు నీళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.
  • రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు: పంటలను కాపాడుకునేందుకు నీటిని పారించుకున్న జూరాల రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, లగచర్ల రైతులకు బేడీలు వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే కేబినెట్ సమావేశం నిర్వహించి రైతులకు, కూలీలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *