భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్ – SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేటి (గాంధీ జయంతి) నుంచి ముంబై వేదికగా దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబైలో తీవ్ర హైడ్రామా చోటుచేసుకుంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మెరైన్ డ్రైవ్ వద్ద ప్లకార్డులతో కనిపించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరగ్గా, దాన్ని పోలీసులు ఖండించారు. కేవలం వివరాలు అడిగేందుకే స్టేషన్కు తీసుకెళ్లామని పోలీసులు తెలపగా, తన సమయాన్ని వృథా చేసేందుకే టీ తాగుదామని పిలిచి స్టేషన్లో కూర్చోబెట్టారని దీప్కే ఆరోపించారు. కాగా, సీజేపీ శివాజీ పార్క్ వద్ద భారీ నిరసనకు యత్నించినప్పటికీ, ట్రాఫిక్ నియమాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.
మరోవైపు, సీఈసీ రాజీనామా మరియు ఓటర్ల జాబితా నిర్వహణలో పారదర్శకతను కోరుతూ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటానికి సిద్ధమైంది. ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ పేరుతో నేటి నుండి ఈ నెల 8వ తేదీ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. సీఈసీ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని సీజేపీ స్పష్టం చేయడంతో పాటు, ఇతర ప్రతిపక్షాలు కూడా ఉద్యమబాట పట్టడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.

