Breaking News

రంగంలోకి ఈడీ: వివేకా కేసులో ఆర్థిక లావాదేవీలపై ఆరా

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తీవ్ర ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (A-1) తో పాటు ఉమాశంకర్ రెడ్డి (A-3) ని ఈడీ అధికారులు హైదరాబాద్ కార్యాలయంలో రెండో రోజు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.

ఈ కేసులో రూ.40 కోట్ల భారీ సుపారీ ఒప్పందం జరిగిందన్న సీబీఐ ఆరోపణల నేపథ్యంలో.. అందులో అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.1 కోటి, అలాగే రూ.4 కోట్ల నగదు చేతులు మారడంపై అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నిధుల మూలాలు ఎక్కడివి, ఎవరి ద్వారా చేతులు మారాయి, తుది లబ్ధిదారులు ఎవరనే వివరాలను ఈడీ ఆరా తీస్తోంది. ఇటీవల సునీల్ యాదవ్ ఇచ్చిన వివరాలు, 2019 నుంచి నిందితుల బ్యాంక్ ఖాతా లావాదేవీల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *